గుంటూరు, జనవరి 4:
విభిన్న ప్రతిభావంతులు విద్య, ఉపాధితో పాటు గౌరవప్రదమైన జీవనం సాగించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు.
ఆదివారం స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని జిల్లా విభిన్న ప్రతిభావంతుల కార్యాలయంలో నిర్వహించిన సర్ లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని, బ్రెయిలీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజువల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తులు కూడా విద్యను సమానంగా అభ్యసించేందుకు బ్రెయిలీ లిపిని అందించిన లూయిస్ బ్రెయిలీ సేవలు చిరస్మరణీయమన్నారు.
జిల్లాలోని సుమారు 18 వేల మంది విజువల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తులకు అవసరమైన ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల నాలుగో శనివారం ప్రత్యేక ఫిర్యాదుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు.
విజువల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తులు సివిల్ సర్వీసులు వంటి అత్యున్నత ఉద్యోగాల్లోనూ విజయవంతంగా రాణిస్తున్నారని, వరల్డ్ కప్ సాధించిన కరుణ కుమారి వంటి వారు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విజువల్లీ ఛాలెంజ్డ్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తోందని, రూ.6,000 సామాజిక భద్రతా పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ బ్రెయిలీ లిపి క్యాలెండర్‌ను ఆవిష్కరించి, దివ్యాంగుల సంఘ నాయకులను సన్మానించారు. మానసిక విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులు గీసిన చిత్రపటాన్ని కలెక్టర్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.


