రక్షణ న్యూస్, పల్నాడు
జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం కొండవీడు కోట ఖ్యాతిని రాష్ట్రం నలుమూలలా చాటిచెప్పేలా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో అట్టహాసంగా కొండవీడు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు. ఉత్సవాల నిర్వహణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి, నోడల్ అధికారిగా జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియను నియమించినట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, ఉత్సాహపూరిత వాతావరణంలో పండుగ నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు, స్టాల్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు సమృద్ధిగా కల్పించాలని సూచించారు. కొండవీడు కోటకు ఫిరంగిపురం, నాదెండ్ల, వంకాయలపాడు మార్గాల నుంచి రహదారి మరమ్మతులు చేపట్టాలని, గత ఉత్సవాల్లో విశేష స్పందన పొందిన హెలి రైడ్, బోటింగ్ వంటి కార్యక్రమాలకు తోడు మరిన్ని ఆకర్షణలు రూపొందించాలని ఈవెంట్ మేనేజర్‌కు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, డీఆర్వో మురళి, ఆర్డీవో మధులత, డీపీఓ నాగేశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


