
బాపట్ల : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల పట్టణ సీఐ రాంబాబు సూచించారు. పండుగ రోజుల్లో అనవసరమైన జూదం, అక్రమ కోళ్లపందాలు పూర్తిగా నిషేధించబడినట్లు గుర్తుచేశారు. కుటుంబాలతో ప్రశాంతంగా, సాంప్రదాయ క్రీడలతో పండుగను జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రత కోసం పలు సూచనలు చేస్తూ సీఐ రాంబాబు ఇలా తెలిపారు:
– పండుగకు ఊరికి వెళ్లే వారు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా, బంగారం–నగదు బ్యాంకుల్లో భద్రపరచుకోవాలి.
– ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని మానిటరింగ్ చేయాలి.
– ఇంటికి తాళం వేసినప్పుడు అది బయటికి కనిపించకుండా కటన్ ఏర్పాటు చేయాలి.
– రాత్రి వేళల్లో ఇంటి ప్రాంగణంలో లైట్లు వెలిగేలా చూసుకోవాలి.
ప్రయాణాలకు సంబంధించి:
– రైల్వే స్టేషన్, బస్టాండ్లలో బంగారం, నగదు, మొబైల్స్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
– మహిళలు ప్రయాణ సమయంలో మెడలో విలువైన బంగారం ధరించకూడదు.
– ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.
– కార్లు, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ కట్టుకోవాలి. అతివేగంగా వెళ్లరాదు.
– ఉదయం మంచు ఎక్కువగా ఉండే వేళల్లో లైట్లు, ఇండికేటర్లతో పరిమిత వేగంతో వాహనం నడపాలి.
– మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం కఠినంగా నిషేధించబడిందని హెచ్చరించారు.
సంక్రాంతి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సీఐ రాంబాబు ప్రజలను కోరారు.

