
వరంగల్ |
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య –
ప్రేమ, అనుమానం, బ్లాక్‌మెయిల్ మధ్య నలిగిపోయిన ఓ మహిళా కానిస్టేబుల్ జీవితం విషాదాంతమైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత (మహిళా కానిస్టేబుల్) తీవ్ర మానసిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.
నాలుగేళ్లుగా తనను పెళ్లి చేసుకుంటానంటూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ అనే దూరపు బంధువు అనితను వేధించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. డ్యూటీలో ఉన్న సమయంలోనూ వీడియో కాల్స్ చేయాలని, ఇతరులతో మాట్లాడొద్దంటూ అనుమానాలతో వేధింపులకు పాల్పడ్డాడని తెలిపారు. రాజేందర్ వైఖరి నచ్చక అనిత తల్లిదండ్రులు వివాహానికి నిరాకరించారు.
ఈ నేపథ్యంలో అనిత స్నేహితుడు జబ్బార్ లాల్‌తో సన్నిహితంగా ఉంటుందని అనుమానించిన రాజేందర్, అతనికి తప్పుడు సమాచారమిచ్చాడని తెలుస్తోంది. దీంతో జబ్బార్ లాల్ కూడా అనితను వేధించడం ప్రారంభించాడు. డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగడంతో అనిత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది.
ఇద్దరి వేధింపుల కారణంగా తన జీవితం నాశనమైందని, చావే దిక్కని అనిత రాజేందర్‌కు ఫోన్ చేసి కన్నీరు పెట్టుకున్నా, అతడు నిర్లక్ష్యంగా స్పందించాడని ఆరోపణలు ఉన్నాయి. చివరకు తీవ్ర మనోవేదనతో అనిత ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనపై రాజేందర్, జబ్బార్ లాల్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడం పోలీస్ విభాగంతో పాటు సమాజాన్ని కలచివేసింది. వేధింపులపై ఫిర్యాదు చేసే మహిళలకు భరోసా, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

