రక్షణ న్యూస్, గుంటూరు
విభిన్న ప్రతిభావంతులు విద్య, ఉపాధితో పాటు గౌరవప్రదమైన జీవనం సాగించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పటిష్ట చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని జిల్లా విభిన్న ప్రతిభావంతుల కార్యాలయంలో నిర్వహించిన సర్ లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్, బ్రెయిలీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విజువల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తులు సమానంగా విద్యను అభ్యసించేందుకు బ్రెయిలీ లిపి అందించిన లూయిస్ బ్రెయిలీ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 18 వేల మంది విజువల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తులకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని, వారి సమస్యల పరిష్కారానికి ప్రతి నెల నాలుగో శనివారం ప్రత్యేక ఫిర్యాదుల దినోత్సవం నిర్వహిస్తున్నామని వివరించారు. సివిల్ సర్వీసులు వంటి అత్యున్నత ఉద్యోగాల్లోనూ విజువల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తులు విజయవంతంగా రాణిస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజువల్లీ ఛాలెంజ్డ్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తోందని, రూ.6,000 సామాజిక భద్రతా పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రెయిలీ లిపి క్యాలెండర్‌ను ఆవిష్కరించి, దివ్యాంగుల సంఘ నాయకులను సన్మానించగా, మానసిక విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులు గీసిన చిత్రపటాన్ని కలెక్టర్‌కు అందజేశారు.
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వ సంకల్పం
RELATED ARTICLES

