Sunday, February 22, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్బీసీ ఉద్యోగుల సాధికారతకు ప్రభుత్వ భరోసా

బీసీ ఉద్యోగుల సాధికారతకు ప్రభుత్వ భరోసా

📰 Generate e-Paper Clip




రక్షణ న్యూస్, విజయవాడ

ఉద్యోగుల హక్కుల పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానికి వారధులని రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన బీసీ, ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, ఈ సదస్సు దేశానికి ఒక మంచి సందేశం ఇచ్చేలా నిర్వహించబడిందని అభినందించారు. బీసీ, ఓబీసీ ఉద్యోగుల క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ అనంతరం ఆమె మాట్లాడుతూ, ఒక బీసీ మంత్రిగా ఈ మహాసభలో పాల్గొనడం తనకు గర్వకారణమని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన తొలి నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అని కొనియాడుతూ, బీసీలకు రిజర్వేషన్లు, రాజకీయ–పారిశ్రామిక అవకాశాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే ఒరవడిని కొనసాగిస్తూ బీసీ ఉద్యోగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు భయాల్లేకుండా ప్రశాంతంగా పనిచేసే వాతావరణం ఉందని భరోసా ఇచ్చారు.
బీసీ, ఓబీసీ వర్గాల అభివృద్ధికి విద్యే కీలకమని పేర్కొన్న మంత్రి, డీఎస్సీ, సివిల్ సర్వీసెస్ కోచింగ్‌లు, బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల ఆధునికీకరణకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. చట్టసభల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై తీర్మానం కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేస్తూ, అమరావతి, పోలవరం, పరిశ్రమల అభివృద్ధితో రాష్ట్ర భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలు వేస్తోందన్నారు. ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించే అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని తెలిపారు.
ఈ సభలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా అమరావతిలో బీసీ, ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ జరగడం చారిత్రాత్మకమని అన్నారు. బీసీల రక్షణకు ప్రత్యేక “బీసీ రక్షణ చట్టం” తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, బీసీలు అన్ని రంగాల్లో ఎదగాలని పిలుపునిచ్చారు. బీసీ ఉద్యోగుల సంఘం నేత గుత్తుల వీరబ్రహ్మం బీసీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు, క్రీమీలేయర్ తొలగింపు, బీసీ అట్రాసిటీ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభ బీసీ ఉద్యోగులలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, వారి సాధికారత దిశగా ఒక మైలురాయిగా నిలిచిందని వక్తలు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular