రక్షణ న్యూస్, గుంటూరు
గుంటూరు నగరంలో జనవరి 6 నుంచి 18 వరకు నర్సరావుపేట రహదారిలోని రెడ్డి కళాశాల ఎదుట నిర్వహించనున్న జాతీయ స్థాయి సరస్ (అఖిల భారత డ్వాక్రా బజార్) ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు గారితో కలిసి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ పరిశీలించారు. ప్రదర్శన ప్రాంగణంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భద్రత, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ ఆదేశిస్తూ, స్టాళ్ల వద్ద అగ్నిమాపక పరికరాలు, స్పష్టమైన ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, సరైన పార్కింగ్, గాలి చొరబాటు ఏర్పాట్లు చేయాలని, తొక్కిసలాటలు జరగకుండా సందర్శకుల సంఖ్యను నియంత్రించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఈ బజార్‌ను నిర్వహిస్తోందని, గుంటూరు మిరపకు గుర్తుగా “మిరపకాయ”ను మాస్కాట్‌గా ఎంపిక చేసినట్లు తెలిపారు. దేశం నలుమూలల నుంచి స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులతో పాటు హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, చీరలు, గృహ అలంకరణ వస్తువులు, ఆర్గానిక్ ఆహార శాలలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిల్డ్రన్ పార్క్‌తో మొత్తం 300 స్టాళ్లలో (150 ఇతర రాష్ట్రాలు, 150 రాష్ట్రానికి చెందినవి) ప్రదర్శన, విక్రయాలు జరగనున్నాయని పేర్కొన్నారు.