rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 2:53 pm Digital Edition : RAKSHANA DAILY DESK

సుపరిపాలనే లక్ష్యం.

నూజివీడు/ఏలూరు, జనవరి 4:
భూ రికార్డులను ఎవరూ మార్పు చేసేందుకు వీలులేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో జరిగిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూమి యజమానులకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, అందుకే తమ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసిందన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలపై రాజముద్ర ఉండాలే తప్ప వ్యక్తుల ఫోటోలు కాదని స్పష్టం చేశారు.
రెవెన్యూ, భూ సమస్యలను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 22A వివాదాస్పద భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలతో పథకాలను మరింత పారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, తహసీల్దార్, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.