rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 7:37 am Digital Edition : RAKSHANA DAILY DESK

ఘనంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు.<br>గుంటూరులో ప్రముఖుల సందడి

గుంటూరులో ఘనంగా నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, ఇతర ప్రతినిధులు సంప్రదాయ పూర్వకంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
తెలుగు భాష ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని, ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పడంలో తెలుగు మహాసభలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. తెలుగు భాషను, తెలుగుదేశం పార్టీని విడదీయలేమని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాతే మన అమ్మ భాషకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందని, అంతకు ముందు తెలుగు వారిని “మద్రాసీలు, సాంబారీలు” అని పిలిచే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహానేత స్వర్గీయ నందమూరి తారకరామారావు అని కొనియాడారు. అదే ఆత్మవిశ్వాసాన్ని నేటి తరం వరకు తీసుకెళ్తూ, చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయిలో తెలుగు వారి గౌరవాన్ని నిలబెడుతున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, ప్రపంచ తెలుగు మహాసభల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
3వ ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు భాష, సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తూ గుంటూరును మరోసారి తెలుగు ప్రపంచానికి కేంద్రంగా మార్చాయి.