rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 8:19 am Digital Edition : RAKSHANA DAILY DESK

ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం

3వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తపాలా శాఖ ప్రత్యేక కవర్‌ను ఆవిష్కరించి సభలో ప్రసంగించారు. సినిమా ఈవెంట్లకు వచ్చినట్టుగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలు మాతృభాషకు ఇచ్చే గౌరవ వందనమని పేర్కొన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ పేరుతో వేదిక ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, వందలాది భాషల్లో కేవలం ఆరు భాషలకు మాత్రమే ప్రాచీన హోదా లభించగా అందులో తెలుగు ఉండడం గర్వకారణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతుండగా, 40 దేశాల నుంచి ప్రతినిధులు రావడం తెలుగు వైభవానికి నిదర్శనమని చెప్పారు.
వేమన, సుమతి, భాస్కర పద్యాలు, కవిత్రయం నుంచి శ్రీశ్రీ వరకు ఎందరో మహానుభావులు తెలుగుకు సేవ చేశారని గుర్తు చేశారు. పిల్లల్లో మాతృభాషపై మమకారం పెంచాలని, టెక్నాలజీ వల్ల తెలుగు భాషకు ముప్పు లేదని, అదే భాషను కాపాడే సాధనమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాజమండ్రిలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే భాషను కాపాడాల్సిందేనని, తెలుగు జాతి అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.