rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 12:49 pm Digital Edition : RAKSHANA DAILY DESK

ఇసుక వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలి: మంత్రి కొల్లు రవీంద్ర

రక్షణ న్యూస్, రాజమహేంద్రవరం

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ఉచిత ఇసుక పాలసీ దేశంలోనే ప్రత్యేకమని, అయితే ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాల్లోను కనిపిస్తున్న లోపాలను వెంటనే సరిదిద్దాలని రాష్ట్ర ఎక్సైజ్, మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో మైన్స్ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
జిల్లాలో ఇసుక సరఫరా, అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రణ, ప్రజల సంతృప్తి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. గతంలో ఇసుక విధానాల్లో లోపాల వల్ల నిర్మాణ రంగం నష్టపోయిందని గుర్తు చేసిన మంత్రి, ఇకపై అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలన్నారు. అక్రమ మైనింగ్, అధిక లోడ్, అనధికార రవాణాపై కఠిన చర్యలు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ప్రజల సంతృప్తే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇసుక వ్యవస్థకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వేలో ఇటీవల 10 శాతం పెరుగుదల రావడం సానుకూల పరిణామమని, దీన్ని మరింత పెంచేలా క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగుపరచాలని సూచించారు.
APSMS ద్వారా డిజిటల్ ట్రాకింగ్ అమలుతో పారదర్శకత పెరిగిందని అధికారులు వివరించారు. చట్టబద్ధ రీచ్‌లలో కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక బుకింగ్‌లు గణనీయంగా తగ్గాయని వెల్లడించారు.
సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని ఇసుక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.