rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 12:47 pm Digital Edition : RAKSHANA DAILY DESK

సరస్‌కు కళల కాంతి

రక్షణ న్యూస్, గుంటూరు

సరస్ – అఖిల భారత డ్వాక్రా బజార్‌లో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళవారం పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్‌తో కలిసి సరస్ ప్రాంగణాన్ని ఆమె పరిశీలించారు.
ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరస్‌ను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయని, పిల్లల వినోదానికి ప్రత్యేక పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సరస్‌లో సంప్రదాయ, ఆర్గానిక్ ఆహార పదార్థాలు, చేనేత-హస్త కళల ఉత్పత్తులు, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువుల ప్రదర్శన, విక్రయం జరుగుతుందని తెలిపారు. మొత్తం 600 మందికి పైగా చేనేత, హస్త కళాకారులు పాల్గొననుండగా, 125 స్టాళ్లు రాష్ట్రానికి, మరో 125 స్టాళ్లు ఇతర రాష్ట్రాలకు కేటాయించనున్నట్లు చెప్పారు. అదనంగా 50 స్టాళ్లలో ప్రభుత్వ శాఖల సమాచారం అందుబాటులో ఉంచనున్నారు.
నాలెడ్జి పెవిలియన్‌లో ప్యాకింగ్, మార్కెటింగ్‌పై రోజువారీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు, మహిళా-హిత, పర్యావరణ హిత వాతావరణంలో సరస్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా సరస్ ప్రాంగణంలో మొబైల్ ఏటీఎంను ప్రారంభించగా, ఆరుగురు బ్యాంకింగ్ కరస్పాండెంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.