rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 12:45 pm Digital Edition : RAKSHANA DAILY DESK

ఎస్ఐపీబీతో అభివృద్ధి జోరు

రక్షణ న్యూస్, అమరావతి

సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 14వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడి ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు.
గత 13 ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు, 8.23 లక్షల ఉద్యోగ అవకాశాలకు ఆమోదం లభించిందని సీఎం తెలిపారు. 2025లో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో 2026లోనూ పనిచేయాలని మంత్రులు, అధికారులకు సూచించారు.
రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంలో విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలు కీలకంగా నిలిచాయని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలను 13 పైసలు తగ్గించడంతో పాటు రూ.4,500 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించిందని తెలిపారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ.3.70కు తగ్గించడమే లక్ష్యమన్నారు.
టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని సీఎం వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.