• ప్రతి నీటి చుక్కకు ఎక్కువ ఆదాయం
• ఆటోమేషన్‌తో సుస్థిర వ్యవసాయం
• మైక్రో ఇరిగేషన్‌తో రైతు భవిష్యత్
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం స్మార్ట్ వ్యవసాయం దిశగా వేగంగా అడుగులు వేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సూక్ష్మ సాగునీటిలో ఆటోమేషన్‌ను ప్రారంభించిన మంత్రి, తగ్గుతున్న నీటి వనరులు, వాతావరణ మార్పులు, పెరుగుతున్న సాగు వ్యయాల మధ్య రైతు ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ఇకపై నీరు, ఎరువుల వినియోగం సెన్సర్లు, డేటా, ఆటోమేషన్ ఆధారంగా జరగడంతో 20–30 శాతం నీటి ఆదా, కార్మిక వ్యయాల తగ్గింపు, దిగుబడి మరియు నాణ్యత పెరుగుదల సాధ్యమవుతుందని తెలిపారు. “పర్ డ్రాప్ మోర్ క్రాప్” నుంచి “పర్ డ్రాప్ మోర్ రిటర్న్స్” దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని చెప్పారు.
PMKSY పథకం కింద హెక్టారుకు రూ.40,000 వరకు మద్దతుతో ఈ కార్యక్రమం అమలు అవుతుండగా, చిన్న, సన్నకారు, SC/ST రైతులకు 55 శాతం, ఇతర రైతులకు 45 శాతం సబ్సిడీ అందించనున్నట్లు వెల్లడించారు. పారదర్శక అమలు, స్థిర ధరలు, వారంటీ, సర్వీస్ సపోర్ట్‌తో రైతుకు పూర్తి భరోసా కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
స్మార్ట్ ఇరిగేషన్‌తో నీటి ఆదా, వ్యయ నియంత్రణ, అధిక దిగుబడులు సాధించి రైతు ఆదాయాన్ని స్థిరపరచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆదర్శంగా నిలబెడతామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.