

యోగి వేమన జయంతి సందర్భంగా ఘన నివాళులు
వేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశకాలు
—
కలెక్టర్ కృతిక శుక్లా
యోగి వేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశకాలుగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. యోగి వేమన జయంతిని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వేమన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలోని మూఢనమ్మకాలను ఖండిస్తూ సమానత్వం, నైతికత, మానవ విలువలను తన పద్యాల ద్వారా ప్రజలకు అందించిన మహనీయుడు యోగి వేమన అని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, ఆచరణాత్మక జీవన విధానమే వేమన బోధనల సారమని తెలిపారు. యువత వేమన సందేశాలను జీవితంలో అమలు చేసుకుంటే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని సూచించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహాకవిగా వేమనను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, ఇతర జిల్లా అధికారులు పాల్గొని యోగి వేమనకు నివాళులు అర్పించారు.