rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 3:58 am Digital Edition : RAKSHANA DAILY DESK

దారుణం…

దుగ్గిరాల మండలంలో దారుణ హత్య

ప్రియుడి మోజుతో భర్తను హత్య చేసిన భార్య

బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి…

ఆపై ఊపిరాడకుండా చేసి హత్య

గుంటూరు జిల్లా, మంగళగిరి–దుగ్గిరాల :
దుగ్గిరాల మండలంలో ఒక మహిళ ప్రియుడి మోజుతో భర్తను హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. దుగ్గిరాలకు చెందిన శివ నాగరాజును అతని భార్య లక్ష్మీ మాధురి తన ప్రియుడు గోపితో కలిసి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.
పోలీసుల వివరాల ప్రకారం… నిన్న రాత్రి లక్ష్మీ మాధురి భర్త శివ నాగరాజుకు బిర్యానీ వండించి, అందులో సుమారు 20 నిద్ర మాత్రలను పొడిగా చేసి కలిపి ఇచ్చింది. బిర్యానీ తిన్న అనంతరం శివ నాగరాజు స్పృహ కోల్పోయాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ప్రియుడు గోపితో కలిసి ముఖంపై దిండు పెట్టి నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు విచారణలో తేలింది.
హత్య అనంతరం ఈ ఘటనను గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు. అయితే మృతుడి చెవిలో నుంచి రక్తం రావడం గమనించిన పోలీసులు అనుమానంతో భార్యను విచారించగా, చివరకు హత్య చేసినట్టు ఆమె ఒప్పుకున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. ప్రియుడు గోపి పాత్రపై కూడా లోతైన దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.